జాతరో... జాతర...! జిల్లాలో మొదలైన బ్రహ్మోత్సవాల సందడి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, May 1, 2022

జాతరో... జాతర...! జిల్లాలో మొదలైన బ్రహ్మోత్సవాల సందడి

 జాతరో... జాతర...!


- జిల్లాలో మొదలైన బ్రహ్మోత్సవాల సందడి


- రెండేళ్ల తరువాత భక్తులకు దేవుడు దర్శనం 


- మొదలైన యమగానిపల్లె మహాభారత బ్రహ్మోత్సవాలు




కుప్పం, స్వర్ణముఖి న్యూస్ ప్రతినిధ, సీ.ఎం.రమేష్ కుమార్ : ఆధ్యాత్మికకు పుట్టినిల్లు.. బ్రహ్మోత్సవాల బాంఢాగారం చిత్తూరు జిల్లా..! తింటే గారిలే తినాలి... వింటే మహాభారతం వినాలన్న పూర్వికులు ఏ నోట అన్నారో తెలియదు కానీ భారత, భాగవత కథలంటే చెవి కోసుకునే వాళ్ళు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. కానీ, మహాభారతాన్ని ఒక ఇన్నిస్టిట్యూషన్ లాగా రూపొందించడం ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే జరుగుతుంది. బహుశా దేశం మొత్తంలో ఇంకెక్కడా కూడా మహాభారతంలోని ఇతిహశాలను ప్రదర్శించడం ఒక్క మహాభారత బ్రహ్మోత్సవాలలో మాత్రమే సాధ్యం. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే జాతర మహోత్సవాలు గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల భక్తులకు దేవుడి దర్శనం భాగ్యం లేకుండా పోయింది. అయితే ఈ ఏటా కరోనా కేసులు లేకపోవడంతో ప్రభుత్వం ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. దింతో జిల్లాలో జాతర సందడి మొదలైపోయింది. చిత్తూరు జిల్లాలో వేసవి కాలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉంది. జాతరలలో పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం  నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు.  పంట కాలం పూర్తయి పంటలన్ని ఇంటికి చేరిన సమయాన వచ్చే మహాభారత బ్రహ్మోత్సవాలు అటు రైతులకు, ఇటు రైతులపై ఆధారపడిన వారికి చాల పెద్ద పండుగ. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జాతర సందడి నెలకొంది.


- మొదలైన మహాభారత బ్రహ్మోత్సవాలు 



కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యముగానిపల్లె పుణ్యక్షేత్రం శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మ రాజుల స్వామి వారి మహాభారత బ్రహ్మోత్సవాలుకు చిత్తూరు చిత్తూరు జిల్లాలోని యమగానిపల్లెలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. మూడు రాష్ట్రాల కూడలిలో ద్రవిడ విశ్వవిద్యాలయంకు కూతవేటు దూరంలో ఉన్న యమగానిపల్లె మహాభారత బ్రహ్మోత్సవాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆంధ్ర నుండే కాక అటు కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చి అమ్మ, స్వామివారి సేవలో పాల్గొంటారు. సుమారు ఇరవై రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో  భారతంలోని 18 పర్వాలకు ప్రతిగా 18 ఘట్టాలను 18 రోజులు జరుపుతారు. రెండు రోజులు అదనంగా భారతానికి సంబందం లేని బాలనాగమ్మ వంటి వేరే నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ మహాభారత నాటకోత్సవాలు బహు జనాధరణ పొందింది. ద్రౌపతీ సమేత పంచ పాండవుల ఆలయం వున్న వూర్లల్లోనే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ సందర్భంలో ఇక్కడ జరిగే తిరునాళ్లు ప్రజలకు పెద్ద వినోధం. ఈ భారత నాటక మహోత్సవాలు జరిగే మైదానంలో అనేక అంగళ్ళూ, రంగుల రాట్నం, ఆటలు, తోలు బొమ్మలాటలు ఇలా అనేక విశేషాలతో ఈ జాతర జరుగుతుంది. ఇరవై రోజుల పాటు మహా వైభవంగా జరిగే ఇలాంటి ఉత్సవం మరెక్కడా జరగదు. పైగా 18 రోజులు పగలూ, రాత్రి కూడా వుంటుంది. పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు.


- కడవ... కత్తి



ఈ బ్రహ్మోత్సవాలలో మొదటగా అంకురార్పణ, ధ్వజారోహణంతో జాతర ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే గర్భగుడిలోని శ్రీ ధర్మ రాజుల విగ్రహం ముందు నవధాన్యాలతో పూజలు నిర్వహించి ఒక కడవ ఉంచుతారు. ఆ కడవ  కొన భాగంలో కత్తిని నిలబెడతారు. అలా కడవపై కత్తి నిలబడితేనే బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. మట్టి కుండపై ఏ సహాయం లేకుండా కత్తి నిలబడడం స్వామి అమ్మవార్ల అనుగ్రహమేనని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాల ప్రారంభం అతి నిష్టగా, శాస్త్ర, సాంప్రదాయ బద్దంగా జరుగుతుంది. ఒక పొడవాటి వెదురు కర్రకు పూలు, మామిడి ఆకులతో అలంకరించి.. దాని చివరన ఒక పసుపు గుడ్డను కట్టి అందులో కొన్ని పూజా ద్రవ్యాలను, పూలు, కొబ్బరి కాయ వంటి వాటిని కట్టి ఆవెదురును అక్కడ నిలబెట్టి పాతుతారు. ఆ మైదాన ప్రాంతంలో ముందుగా బలిరాముడు అనే విగ్రహాన్ని నిలబడి వున్న తీరులో నిర్మిస్తారు. ఈ బలిరాముడు మహా భారతంలో జరగబోయే, యుద్ధంతో సహా అన్ని కార్యక్రమాలకు సాక్షీభూతంగా వుంటాడని నమ్మకం. ఈ విగ్రహం ఉత్సవాలు ముగిసినంత వరకు వుంటుంది. 


- బ్రహ్మోత్సవాలలో విశిష్ట ప్రాముఖ్యత ఉన్న ఘట్టాలు




 పద్దెనిమిది రోజులపాటు జారిగే ఈ ఉత్సవ కాలంలో ప్రతి రోజు భారతం లోని ఒక ఘట్టం పగలు హరికథ రూపంలో చెబుతారు. అదే ఘట్టాన్ని రాత్రి నాటక రూపంలో ప్రదర్శిస్తారు.  ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టాలు  ప్రారంభం రోజు,  బక్కాసుర వధ,  అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, ద్రౌపతి వస్త్రాపహరణ, ఇలావంతుని బలి చివరగా ధుర్యోధన వధ. ఈ ముఖ్యమైన ఈ రోజులలో వీక్షించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుండే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుండి ప్రజలు తండోప తండాలుగా వస్తారు. 


 బకాసుర వధ నాడు భీముని వేష దారి ఒక ఎద్దులబండిపై కూర్చొని  పల్లెల్లో తిరుగుతాడు. ఆ పల్లె ప్రజలు ప్రతి ఇంటి వారు అన్నం, పిండి వంటలు మొదలగు వాటిని ఆ బండిలో వేస్తారు. చివరగా బండి ఆలయ ప్రాంగణంలోకి వస్తుంది. ఆ రాత్రే బకాసుర వధ నాటకం చాల రసవత్తరంగా జరుగు తుంది. 


- అర్జునుడు తపస్సు మాను ఎక్కుట అత్యంత వైభవంగా నిర్వహిస్తారు



అర్జునుడు దివాస్త్రాల కోసం చేసే తపస్సుకు ప్రతీకగా నిలబెట్టిన ఒక స్తంభాన్ని ఎక్కుతాడు. అర్జున పాత్ర ధారి మెట్టు మెట్టుకూ ఎక్కుతూ నాటకీయంగా పద్యం పాడుతూ అధిగమిస్తాడు. తపస్సుకు వీలుగా మాను పైనవెడల్పుగా ఒక మంచెను ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన మానును తపస్మాన్ గా పిలుస్తారు. ఆర్జునుడు తపస్మాన్ ఎక్కే రోజు అనగానే చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో తెల్లవారు జామునే వచ్చి చేరుకుంటారు. అర్జునుడు తపస్మాన్ ఎక్కిన తరువాత ఓ విల్లు ఆకారం కలిగిన వెడల్పాటి చత్రంలో కూర్చుని, నిమ్మ కాయలు, విభూతి, పళ్ళు, పూలు లు నేల మీదికి వెదజల్లుతాడు. అర్జునుడు తపస్సు మాను ఎక్కడ అని స్వర్గారోహణంగా భక్తులు భావించి, పైనుంచి క్రింద పడే పళ్ళూ, పూలూ, ఎంతో పవిత్రమైనవిగా ఎంచి వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

అంతే కాదు పిల్లలు కలగని మహిళలు ఈ ఉత్సవానికి హాజరవుతారు. తపస్మాన్ పై నుంచి పడే పళ్ళూ, నిమ్మకాయలు, విభూది, పూల కోసం తలారా స్నానం చేసి తడి బట్టలతో తపస్మాన్ క్రింది వేచి వుంటారు. అర్జునుడు మెట్టు మెట్టుకూ పాట పాడుకుంటూ తపస్మాన్ ఎక్కేటంత సేపూ ఈ స్త్రీలు పడుకుని సాస్టాంగ  ప్రమాణం చేస్తూ తల ఎత్తకుండా అలాగే పడి వుంటారు. అర్జునుడు ప్రసాదాల్ని నేల మీదికి పడవేసే సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి కొంగుల్ని సరిచేసుకొని, మోరలెత్తి ఎదురుచూస్తారు. అర్జునుడు విసిరినవి కింద ఉన్నవారి కొంగులో పడితే వారి కోరిక తప్పక  నెరవేరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


 ధుర్యోధన వధ :- ఇది కూడా పగలే జరిగే కార్యక్రమం. ఆలయ ప్రాంగణంలోనే ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్టు భారీ విగ్రహాన్ని మట్టితో నిర్మిస్తారు. ధుర్యోధన వేషహాదారి, ఆ విగ్రహం మీద నిలబడి పద్యాలు పాడుతుంటాడు. భీమ వేషదారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పద్యాలు పాడుతుంటాడు. అప్పుడప్పుడు ధుర్యోధన వేష ధారి విగ్రహంపై నుండి కిందికి దిగి కొంత సేపు భీమునితో గదా యుద్ధం చేస్తాడు. తిరిగి విగ్రహం పైకెళ్లి పొతాడు. భీముడు మాత్రం ఆ విగ్రహంపైకి వెళ్ల కూడదు. ఇలా పద్యాలు పాడుతూ యుద్ధం చేస్తూ చాల సేపు నాటకాన్ని రక్తి కట్టిస్తారు. చివరగా భీముడు తన గదతో ధుర్యోధనుని విగ్రహం తొడలో అదివరకే పాతి పెట్టిన కుంకుం కలిపిన గుమ్మడి కాయను తన గదతో కొట్టతాడు, అప్పుడు ధుర్యోధన వేషదారి ఆ విగ్రహం పై పడిపోతాడు. అప్పుడు ఆ చుట్టు తిలకిస్తున్న ప్రజలు ధుర్యోధనుని చేసిన మట్టిని తీసుకోడానికి ఎగబడతారు. ఎందుకంటే ఆ మట్టిని తమ గాదెల్లో వేస్తే తమకు ధాన్యం సంవృద్ధిగా వుంటుందని పొలాల్లో చల్లితే పంటలు పుష్కలంగా పండతాయని నమ్మకం ఎక్కువ. ఈ రోజునే వివిధ ప్రాంతాలనుండి భక్తులు అత్యధికంగా వస్తారు. ఆ రోజు రాత్రికి ధుర్యోధన వధ పౌరాణిక నాటకం ప్రదర్శిస్తారు. 


- ప్రతినిత్యం హరికథా కాలక్షేపం



భక్తుల కాలక్షేపం కోసం ప్రతి ఏటా శ్రీ ద్రౌపది సతీసమేత ధర్మరాజుల ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు హరికథాగానం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. హరికథ గానాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల పల్లెల నుండి జనం వస్తారు. ఇలాంటి కథల వలనే నిరక్షరాస్యులైన గ్రామీణ వాసులు పురాణాలలోని విషయాలను అవహగాహన చేసుకునే వారు. ఈ హరికథకుడు ఒక్కడే ఉన్నా పక్కవాయిద్య కారులు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇందులో ఉపయోగించే వాయిద్యాలు తబల, వయొలిన్, హర్మోనియం, వంటివి ఉంటాయి. వాటికి తోడు ప్రధాన కథకుడు చేతిలో చిడతలు పట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని సందర్భాను సారంగా నర్తిస్తూ కథ చెపుతుంటాడు. అప్పుడప్పుడు మధ్యలో పిట్టకథలు, హాస్య సంభాషణము కథను రక్తి కట్టిస్తుంటాయి. ఈ హరికథ కూడా ప్రజలకు చాలా వినోదాన్ని పంచేది. చదువు రాని పల్లె ప్రజలకు పురాణ విజ్ఞానము కలగడానికి ఈ హరికథలే ముఖ్య కారణం.


- నేటి నుండి మే 19 వరకు బ్రహ్మోత్సవాలు


గుడిపల్లి మండలం యమగానిపల్లిలో నెలకొని ఉన్న శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మ రాజుల వారి మహా భారతం బ్రహ్మోత్సవా లు శనివారం అంకురార్పణ,ధ్వజారోహణంతో మొదలై మే నెల 19 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మే 1 తేదిన అభిషేకం,2న ఉదంకుని చరిత్ర, భూతరాజు కథ, 3న చంద్ర వంశావళి,యయాతి చరిత్ర 4న సంతాన చరిత్ర, భీష్మ ప్రతిజ్ఞ 5న ధృతరాష్ట్ర, పాండవ విధురోత్పత్తి,6న పాండవ, కౌరవ జననం 7న పాండవుల కౌరవుల బాల్య క్రీడలు, విద్యాభ్యాసము, ఏకలవ్యుని చరిత్ర 8న ద్రౌపది జననం 9న లక్షా గృహ దహనం, బకాసుర వధ, 10న ద్రౌపది కళ్యాణం 11న నలాహిని చరిత్ర, ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం 12న అర్జునుని తీర్థయాత్ర, సుభద్రా కళ్యాణం 13న రాజసూయ యాగము, ద్రౌపదీ మానసంరక్షణము నాటకం 14న ఉదయం అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, రాత్రి పుష్ప పల్లకి, బాణ వేడుకలు, 15న విరాట పర్వము, 16న రథోత్సవం, అర్జునుడు ఆవుల త్రిప్పుట 17న ఇలావంతుని బలి,18 న దుర్యోధనవధ, సాయంత్రం అగ్ని గుండం, పచ్చిగెరిగె 19న శ్రీ ధర్మరాజు పట్టాభిషేకం, తిలతర్పణం, పొంగుళ్ళతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad