పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రశాంత వాతావరణం లో జరగాలి : డి ఆర్ ఓ
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
ఈ నెల 27 నుండి మే 5 వరకు పదవ తరగతి పరీక్షలు, మే 6 నుండి 24 వరకు ఇంటర్మీడియట్ జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో పరీక్షల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా రెవిన్యూ అధికారి యం. శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచి ఆర్మ్డ్ ఫోర్సు భద్రతతో సిసి కెమెరాల ఏర్పాటు ఉండాలని పరీక్షల నిర్వహణలో చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు లేకుండా చూడాలని అన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో వేసవి కాలం కావున ముందస్తు జాగ్రత్తలతో మున్సిపల్, పంచాయతీరాజ్, పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు, మరుగుదొడ్ల పరిశుభ్రత చూడాలని డి ఎం అండ్ హెచ్ ఓ ముందస్తు జాగ్రత్తగా ఓ ఆర్ ఎస్ తో పాటు పారా మెడికల్ సిబ్బంది సెంటర్లలో అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి పరీక్షా సమాయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పోలీస్ అధికారులు, బందోబస్తు నిర్వహణ, పోలీస్ స్టేషన్ లలో ప్రశ్నాపత్రాల భద్రత వంటివి అప్రమత్తతతో చూడాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయముతో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణం లో పిల్లలకు ఇబ్బంది కలుగకుండా సహకారం అందించాలని సూచించారు. పరీక్షల సమయాలలో కేంద్రాల దగ్గరలోని జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్ లను మూసి వేయాల్సి ఉంటుందని, నిబంధనల మేరకు విద్యార్థులు పరీక్షా హాలులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లరాదని తెలిపారు. ఆర్ టి సి కి సంబంధించి పరీక్షా కేంద్రాలకు నడిపే బస్సుల వివరాలను డిపో ల వద్ద ప్రదర్శించాలని అన్నారు.
తిరుపతి జిల్లాలో పదవతరగతి విద్యార్థినీ విద్యార్థులు180 పరీక్షా కేంద్రాల్లో 27,584 మంది , ఇంటర్ మెదటి, రెండవ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులు 79 పరీక్షా కేంద్రాల్లో 57.234 మంది, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీటం ఆద్వర్యంలో పదవతగతి 1585 మంది , ఇంటర్ 2146 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ సమీక్షలో ఆర్ ఐ ఓ వెంకట రెడ్డి, డి ఇ ఓ వి. శేఖర్, డి ఎం అండ్ హెచ్ ఓ డా. శ్రీ హరి, ఆర్ టి సి ఏటిఎం డి.ఆర్ నాయుడు, ఎస్. ఐ. పరమేష్ నాయుడు, విద్యుత్ శాఖల అధికారులు జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్వర్ణలత, పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి, డి ఇ ఓ కార్యాలయ అధికారి ప్రభావతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment