వకుళమాత ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
పాతకాల్వ పేరూరు బండపై గల వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఈఓ సమాధానాలిచ్చారు.
వకుళమాత ఆలయం చుట్టూ పేరూరు బండపై భక్తులకు ఆహ్లాదం కలిగించేలా పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. అంగప్రదక్షిణ టోకన్లు రోజుకు 750 చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని, అయితే సుమారు 400 టికెట్ల వరకు మిగిలిపోతున్నాయని తెలిపారు. బుక్ చేసుకున్న భక్తుల్లో కొంత మంది రాలేక పోతున్నారని చెప్పారు. స్థానిక భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్లో మిగిలిపోయిన టికెట్లను ఆఫ్ లైన్లో కేటాయిస్తామని తెలిపారు.
తిరుపతిలో శ్రీనివాస సేతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి కరకంబాడి వైపు నుంచి వచ్చే మార్గంలో లీలామహల్ వద్ద వారధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని తెలియజేశారు. ఎస్వీ మ్యూజియాన్ని దాతల సహకారంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వసతులతో త్వరలో పూర్తి చేస్తామన్నారు.
No comments:
Post a Comment