నేడు రాష్ట్రపతి బాధ్యతల స్వీకారం
ద్రౌపదీ ముర్ముతో ప్రమాణం చేయించనున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
వేడుకకు ముస్తాబైన పార్లమెంటు సెంట్రల్ హాలు
హాజరుకానున్న వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు
దిల్లీ: నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ వేడుకలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు/ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్ హాలుకు చేరుకుంటారు. జస్టిస్ ఎన్.వి.రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయిస్తారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాలిలోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక ఆమె రాష్ట్రపతి భవన్‌కు పయనమవుతారు. అక్కడ త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం చేస్తారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. తీన్‌మూర్తి మార్గ్, కౌటిల్య, అక్బర్ రోడ్డు, రఫీ మార్గ్ తదితర మార్గాల్లో సాధారణ వ్యక్తుల వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు..
సంప్రదాయ సంతాలీ చీరలో..?
ద్రౌపదీ ముర్ము సంప్రదాయ సంతాలీ చీర కట్టుకొని ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముర్ము కోసం ఆమె సోదరుడు తరిణిసేన్ టుడు భార్య సుక్రీ టుడు ఒడిశా నుంచి దిల్లీకి ఆదివారం సంప్రదాయ చీరను తీసుకొని వెళ్లారు.
వరుసగా 10 మంది జులై 25నే..
రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్న 10వ వ్యక్తి ద్రౌపదీ ముర్ము. 1977లో నీలం సంజీవ రెడ్డి జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినవారంతా అదే తేదీన బాధ్యతలు చేపడుతున్నారు.
No comments:
Post a Comment