కోటి ఖర్చుతో సముద్రంలో గాలింపు.. చివరికి బెంగళూరులో ప్రత్యక్షం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 28, 2022

కోటి ఖర్చుతో సముద్రంలో గాలింపు.. చివరికి బెంగళూరులో ప్రత్యక్షం

 కోటి ఖర్చుతో సముద్రంలో గాలింపు.. చివరికి బెంగళూరులో ప్రత్యక్షం



ప్రేమించిన వ్యక్తితో పరారీ.. వెళ్లివెతికితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికసముద్రంలో గల్లంతు కాలేదని నిర్ధారణఆర్కే బీచ్‌లో అదృశ్యం కేసులో మలుపులెన్నో..


విశాఖపట్నం

విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె.. నెల్లూరు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు చేరినట్టు తేలింది. రెండేళ్ల క్రితం వివాహమాడిన వ్యక్తిని కాదని.. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగళూరులో సంతోషంగా ఉన్నానని తన తండ్రి ఫోన్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపింది. దీంతో విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత గల్లంతు మిస్టరీ వీడింది. ఆమె సముద్రంలో గల్లంతైందేమోనని భావించి అప్రమత్తమైన పోలీసులు.. నేవీ, కోస్ట్‌గార్డులను రంగంలోకి దించి హెలికాప్టర్ల సాయంతో రెండు రోజులపాటు తీవ్రంగా గాలించారు. దీని కోసం రూ.కోటి వరకూ ఖర్చయిందని అంచనా. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం ఎన్‌ఏడీ ప్రాంతంలోని సంజీవ్‌నగర్‌కు చెందిన రామిరెడ్డి అప్పలరాజు కుమార్తె సాయిప్రియ (21)కు శ్రీకాకుళం జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన శిరుగుడి శ్రీనివాసరావుతో 2020 జూలై 25న వివాహమైంది. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. దంపతులు అక్కడే ఉంటున్నారు. ఈ నెల 25న (సోమవారం) పెళ్లి రోజు కావడంతో రెండు రోజులు ముందే సాయిప్రియ ఇంటికి వచ్చింది. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీనివాసరావుతో కలిసి బీచ్‌కు వెళ్లింది. అయితే అక్కడ ఇద్దరం నీళ్లలోకి దిగామని, తన ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో తాను ఒడ్డుకు వచ్చానని... తిరిగి వెనక్కి చూసేసరికి సాయిప్రియ కనిపించలేదని శ్రీనివాసరావు రాత్రి 8 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయిప్రియ కెరటాల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశాడు. దీంతో పోలీసులు గాలింపు ప్రారంభించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో.. కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు నేవీ, కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో హెలికాప్టర్లు, షిప్‌లు, గజ ఈతగాళ్లతో సముద్రం లోపల కూడా గాలించారు. రెండు రోజులపాటు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. దీనికోసం సుమారు రూ.కోటికి పైగా అధికారులు ఖర్చు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.


బెంగళూరులో ఉన్నట్టు తండ్రికి వాయిస్‌ మెసేజ్‌వివాహిత కోసం అందరూ వెదుకుతుంటే బుధవారం సాయం త్రం ఆమె తండ్రి అప్పలరాజు ఫోన్‌కు గుర్తుతెలియని నంబర్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌ వచ్చింది. ‘నాన్న నేను సాయి మాట్లాడుతున్నాను. నేనేమీ చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. రవి దగ్గర ఉన్నాను. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయింది. నన్నేమీ రవి బలవంతం చేసి తీసుకురాలేదు. దయ చేసి మా గురించి వెతకొద్దు నాన్నా. ప్లీజ్‌ నాన్న. నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావైనా, బతుకైనా వీడితోనే. నేను బతకాలనుకుంటున్నాను. చావాలనే ఉద్దేశం లేదు. గవర్నమెంట్‌వాళ్లకు కూడా సారీ చెబుతున్నాను. నన్ను క్షమించు నాన్నా. మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్‌ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు వెదికినా సరే మేమిద్దరం కలిసి చనిపోతాం. ఆంటీ వాళ్లకి ఇందులో ఏమీ సంబంధం లేదు. వారిని ఏమీ అనొద్దు’ అంటూ సాయిప్రియ మెసేజ్‌ పెట్టినట్టు పోలీసులు ధ్రువీకరించారు. తాము పెళ్లి చేసుకున్నట్టు మెడలో ఉన్న తాళిబొట్టును చూపిస్తూ దిగిన ఫొటోను వాట్సాప్‌ చేసినట్టు ప్రచారం జరుగుతున్నా పోలీసులు ధ్రువీకరించడం లేదు. 

ఎవరీ రవి..సాయిప్రియ పెళ్లిచేసుకున్న రవి ఎవరనే దానిపై అంతా ఆరా తీస్తున్నారు. తిరుపతికి చెందిన రవి కుటుంబం చాలాకాలం కిం దట విశాఖ వలస వచ్చింది. ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటోంది. రవి తల్లి టైలరింగ్‌ చేస్తుంటారని, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాయిప్రియ పుట్టిపెరిగింది అదే ప్రాంతం కావడంతో వారిద్దరికీ చాలాకాలంగా పరిచయం ఉంది. ఇది ప్రేమకు దారితీసింది. కానీ సాయిప్రియ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో శ్రీనివాసరావుకు ఇచ్చి పెళ్లిచేశారు. అయితే రవిని ఆమె మరిచిపోలేదు. ఈనెల 25న తన భర్తతోపాటు బీచ్‌కు వెళుతున్నప్పుడే విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. దీంతో రవి కూడా వారితోపాటే బీచ్‌కు వెళ్లాడు. శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు చూస్తున్న సమయంలో సాయిప్రియ అక్కడి నుంచి రవితో కలిసి వెళ్లిపోయింది. రైలులో మొదట నెల్లూరు, ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు. పోలీసులు బీచ్‌రోడ్డులోని సీసీ కెమెరాలను పరిశీలించగా సాయిప్రియ ఆచూకీ కనిపించలేదు. కానీ ఒక యువకుడు అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు కనిపించడంతో అనుమానం కలిగింది. ఆ వ్యక్తిని సాయిప్రియ తల్లిదండ్రులకు చూపించగా, రవిగా గుర్తించారు. దీంతో పోలీసులు రవి సెల్‌ఫోన్‌ను ట్రాకింగ్‌ చేయడంతో నెల్లూరులో ఉన్నట్టు తర్వాత బెంగళూరు వెళ్లిపోయినట్టు గుర్తించారు. అదే సమయంలో సాయిప్రియ తన తండ్రికి మెసేజ్‌ చేయడంతో మిస్టరీ వీడిపోయింది. సాయిప్రియను బెంగళూరు నుంచి నగరానికి తెచ్చేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad