తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం :
శ్రీ ప్రభాకరాచార్యులు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టిటిడి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం
శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు ఉత్సవాలు శ్రీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని, ఈ ఆగమ శాస్త్రాన్ని శ్రీ మరిచి మహర్షి విమానార్చనకల్పం ఆనంద సహిత గ్రంథాలలో విధివిధానాలతో సమగ్రంగా వివరించారని తెలిపారు. శ్రీవారికి నేడు జరుగుతున్న బంగారు పుష్పాల పూజ శ్రీ మరిచి మహర్షి రూపొందించిన శాస్త్రం ప్రకారమే నేటికీ నిర్వహింపబడుతుందని చెప్పారు.
ఈ శాస్త్ర పరిరక్షణ బాధ్యతలు స్వీకరించి టిటిడి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, ధర్మ పరిరక్షణ ఒక ఉద్యమంలా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ రాఘవ దీక్షితులు ప్రసంగిస్తూ, శ్రీ మరీచి మహర్షి దేవాలయ, మండపాల నిర్మాణాలను, నిత్య పూజలు, ఆరాధనలు విధివిధానాలు వంటి ఎన్నో శాస్త్ర విషయాలను సమగ్రంగా అందించారని చెప్పారు. దేవాలయ నిర్మాణమే సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని వివరించారు.
శ్రీ వి.రామకృష్ణ శేష సాయి ప్రసంగిస్తూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిందని ఈ ఉత్సవ నిర్వహణ, సందర్శన వల్ల భక్తులకు అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని తెలిపారు. తరతరాలుగా బృహత్తరమైన ఈ శాస్త్ర ఆచరణలో వైఖానస అర్చక సమాజం బృహత్తర బాధ్యత పోషిస్తుందన్నారు.
మచిలీపట్నం చెందిన శ్రీమన్ శరత్ కుమార్ మాట్లాడుతూ అష్టాదశ శారీరక సంస్కారాలతో సామాన్య మానవుని మహనీయుడుగా మార్చిన వైఖానస కల్ప సూత్రం ఎంతో అపురూపమైనదన్నారు. మన దేవాలయాలు సంస్కృతిని తరతరాలుగా నిర్వహిస్తున్న, నైతిక విలువలకు మూల స్తంభాలైన మన దేవాలయాలు మన సంస్కృతిని కాపాడుతున్న అర్చక వ్యవస్థ నిరంతరం శాస్త్ర మధనం చేస్తూ ఈ బాధ్యతలను చక్కగా నిర్వహించాలని కోరారు.
తిరుమలకు చెందిన శ్రీ వరాహ నరసింహ దీక్షితులు మాట్లాడుతూ, తిరుమల క్షేత్రంలో పంచ బేరాల ఆరాధనకు మూలం శ్రీ మరీచి మహర్షి రచించిన విమాన కల్ప గ్రంథమని చెప్పారు. పంచ బేరాల ఆరాధన వలన కోట్లాదిమంది భక్తులకు పరమాత్ముడి అనుగ్రహాన్ని ప్రసరింప చేస్తుందన్నారు. శ్రీవారి అనుగ్రహంతో ధర్మబద్ధమైన సమాజం ఏర్పడుతుందని, సమస్త జీవులు ఆయురారోగ్యాలతో, సుఖ సతోషాలతో జీవిస్తారని వివరించారు.
No comments:
Post a Comment