ఎస్వీబీసీ విజయంలో ఉద్యోగులందరూ భాగస్వాములే : టిటిడి ఈఓ, ఎస్వీబీసీ ఎండి శ్రీఎవి.ధర్మారెడ్డి
ప్రజల్లో భక్తిభావాన్ని పెంచేలా కార్యక్రమాలను ప్రసారం చేయడంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ విజయం సాధించిందని, ఈ విజయంలో ఉద్యోగులందరూ భాగస్వాములేనని టిటిడి ఈఓ, ఎస్వీబీసీ ఎండి శ్రీఎవి.ధర్మారెడ్డి అన్నారు. ఎస్వీబీసీ 14వ వార్షికోత్సవం గురువారం రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్ లోగల ఎస్వీబీసీ స్టూడియోలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ బృంద నాయకుడిగా తాను పలురకాల సూచనలు చేశానని, సీఈవో శ్రీ సురేష్ కుమార్ నేతృత్వంలో ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారని కొనియాడారు. ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం ద్వారా ఛానల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సత్కర్మలు చేయడం ద్వారా కుటుంబం, సమాజంలో మంచి పెంపొందుతుందన్నారు. పారాయణ కార్యక్రమాల ద్వారా భక్తులను లీనం చేసి భక్తి భావాన్ని పెంచడంలో ఎస్వీబీసీ సఫలీకృతమైందన్నారు.
ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఎస్వీబీసీ ప్రసారం చేసిన పారాయణ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక వికాసం కలిగిందన్నారు. అందరం కలిసి ఎస్వీబీసీని ఉన్నత శిఖరాలకు తీసుకెళదామని కోరారు.
టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రచారంతోపాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేయడంలో ఛానల్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. స్వామివారి వైభవాన్ని ఉత్తరాదిలోనూ వ్యాప్తి చేయాలని కోరారు.
ధర్మగిరి వేద పాఠశాల శాస్త్ర పండితులు శ్రీ శేషాచార్యులు మాట్లాడుతూ ఎస్వీబీసీ అనే యజ్ఞవేదిక ద్వారా టిటిడి ఒక యజ్ఞంలా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, తద్వారా విశ్వవ్యాప్తంగా భక్తిభావాన్ని పెంచుతోందని అన్నారు.
ఎస్వీబీసీ సీఈవో శ్రీ జి.సురేష్ కుమార్ వార్షిక నివేదికను అందించారు. అనంతరం నూతన సీఈఓ శ్రీ షణ్ముఖ కుమార్, ఎస్వీబీసీ సలహాదారు ఎస్.విజయ్ కుమార్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఇటీవల పదవీ విరమణ చేసిన సీనియర్ మేనేజర్ శ్రీ పద్మనాభ రావు, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీ రమేష్ లను సన్మానించారు. అదేవిధంగా పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు.
No comments:
Post a Comment