రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు
ఆగస్టు 1 నుండి అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయని, కరోనా అనంతరం రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవి.
– శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
– బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడ వాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగనున్నాయి.
– కరోనా కారణంగా తిరుమలలో కొంత కాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభంకానుంది. వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.
చిన్నపిల్లల హృదయాలయ
– గతేడాది అక్టోబర్ 11న ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా తిరుపతిలో ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో ఇప్పటివరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. ఇక్కడి డాక్టర్లు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారు. ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతోంది.
– అదేవిధంగా, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు ఉత్తమ వైద్యం అందించేందుకు రెండు సంవత్సరాల్లో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం.
శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ
– తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీవకుళమాత ఆలయంలో జూన్ 23న మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం ప్రారంభించాం. ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీవైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అమెరికాలో శ్రీనివాస కల్యాణాలు
– అమెరికా దేశంలో స్థిరపడిన తెలుగువారి కోసం ముఖ్యమంత్రి శ్రీవైఎస్.జగన్మోహన్ రెడ్డిగారి ఆదేశం మేరకు జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటి(ఎపిఎన్‌ఆర్‌టిఎస్) సహకారంతో ఈ కల్యాణాలు చేపట్టడం జరిగింది.
– జూన్ 18న శాన్‌ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో, జులై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9న అట్లాంటా నగరాల్లో శ్రీవారి కల్యాణాలు జరిగాయి.
షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష
– సృష్టిలోని జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష చేపట్టాం. జూన్ 25న ప్రారంభమైన ఈ దీక్ష జులై 10న పూర్ణాహుతితో ముగియనుంది.
– అరణ్యకాండలోని మొత్తం 75 సర్గల్లో గల 2,454 శ్లోకాలను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేస్తున్నారు.
– వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, తర్పణ, హోమాదులు నిర్వహిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ
– గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారుచేసేందుకు వీలుగా రెండో విడతలో 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌లతో ఒప్పందం చేసుకున్నాం.
– తొలివిడతలో 500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశాం. ప్రస్తుతం బియ్యం, శనగలు, బెల్లం, కందిపప్పు, పెసలు, పసుపు, వేరుశనగ, మిరియాలు, ధనియాలు, ఆవాలు, చింతపండు, ఉద్దిపప్పు సేకరించాలని నిర్ణయించాం.
– గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తిరుపతిలోని గోశాలను సంప్రదించి ఉచితంగా గోవులు, ఎద్దులను పొందవచ్చు
తిరుమలలో..
– జులై 17న తిరుమలలో ఆణివార ఆస్థానం జరుగనుంది.
జూన్ నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 23.23 లక్షలు
హుండీ :
– హుండీ కానుకలు – రూ.123.74 కోట్లు
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 95.34 లక్షలు
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 50.61 లక్షలు
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 11.61 లక్షలు
ఈ కార్యక్రమంలో జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ నూతన సిఈఓ శ్రీ షణ్ముఖ కుమార్, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment