లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో జూన్ 25వ తేదీ నుండి టీటీడీ నిర్వహించనున్న అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమానికి శుక్రవారం రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థన మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, అంకురార్ఫణ నిర్వహించారు.
ఈ సందర్బంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని మాట్లాడుతూ శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసం చేస్తూ రాక్షసులను సంహారించి, తపస్సు చేసుకునే ఋషులకు రక్షణ కల్పించినట్లు తెలిపారు. అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయన్నారు. ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని చెప్పారు. ” రామస్యపాదౌజగ్రాహలక్ష్మణస్యచధీమతః ” అనే మంత్రంలోని అక్షర క్రమం ప్రకారం ఆయా సర్గల్లోని శ్లోక పారాయణం జరుగుతుందని తెలియజేశారు. తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారని చెప్పారు. అలాగే మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు ప్రతి శ్లోకానికీ నిర్వహిస్తారని వివరించారు.
ఇందులో పాల్గొనే పండితులు ఒక పూట ఆహారం స్వీకరించి, రెండవ పూట పాలు, పండ్లు స్వీకరిస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపై పడుకుంటారన్నారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, వేద పాఠశాల అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment