సీనియర్ జర్నలిస్టు, కవి నన్నూరు శ్రీనివాసరావు రచించిన"తాతకు కొలిచిన ముంత తలాకిట్లో" అనే కవిత ప్రతిభ ప్రశంసలు అందుకుంది. శ్రీ శ్రీ కళావేదిక సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ ఛైర్పర్సన్ హైమవతి భీమన్న, నిర్వాహకులు రమావతి ఆధ్వర్యంలో జరిగిన కవితల పోటీ లో నన్నూరు శ్రీనివాసరావు రచించిన "తాతకు కొలిచిన ముంత తలాకిట్లో" ఎంపిక చేశారు. 2019వ సంవత్సరంలో విజయవాడలో నవ్యాంధ్ర రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన శతకవి సమ్మేళనంలో అప్పటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ చే సన్మానం జరిగిన విషయం తెలిసిందే.
రచన: నన్నూరు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, కవి. |
ప్రసంశపత్రం |
"తాతకు కొలిచిన ముంత తలాకిట్లో"
సృష్టికి.. ప్రతి సృష్టి గా
పుడమికి ధీటుగా
పేగుబంధం పంచి మరోజన్మ నిచ్చి
అమ్మ నాన్నలుగా నిలచాం
ముద్దు మురిపాలు చూసి... ప్రేమ ఆప్యాయతలు పంచి..
ఎండనక, వాననక, రేయనక, పగలనక
కడుపులు కట్టుకుని... కడుపులో పెట్టుకొని పెంచాం
కాటికి కాళ్లు చాచిననాడు కడుపులో పెట్టుకొని చూస్తావని
కాలే కడుపుకి కాస్త కవణం పెడతావని
పెద్దజేసి.. ప్రయోజకులుగా చూసి
తోడు నీడ కోసం పెళ్లి చేస్తే...
కన్నవారి కలలు కాలరాశావ్
నాగరికం పేరుతో అనాగరికంగా వ్యవహరిస్తూ..
మానవత్వం మరచావ్... మమతాను బంధాలు తుంచావ్
ధనార్జన మత్తులో మానవతా విలువలు మరచావ్...
కన్నవారికి ప్రేమానుబంధాలు పంచలేని దుస్థితికి దిగజారావ్
కడుపున పుట్టిన బిడ్డలకు దిక్సూచి నిలచావ్...
సాకి, సంతరించిన తల్లిదండ్రులకి వృద్ధాశ్రమం గతి అన్నావ్....
నీ యవ్వనం ఇలాగే ఉంటుందని విర్రవీగకు..
నీ భోగభాగ్యాలు తోడుగా ఉంటాయని అనుకోకు...
నీ కడుపున పుట్టిన బిడ్డలే నీలాగా ఆలోచిస్తే...
తాతకు కొలిచిన ముంత తలాకిట్లో ఉంటుందని గుర్తుంచుకో...
రచన: నన్నూరు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, కవి.
No comments:
Post a Comment