అమ్మకానికి అమరావతి భూములు..రూ.2,480 కోట్ల సమీకరణకు సీఆర్డీఏ ప్రణాళిక
అమరావతి:
హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది.తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ ఇటీవల 389 జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పురపాలక శాఖ ద్వారా ఈ జీవోను జారీ చేశారు. వచ్చే నెలలోనే వేలం ద్వారా భూములను విక్రయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.గతంలో మెడ్‌సిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలతో పాటు, లండన్‌కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం 148 ఎకరాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థలు నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ భూములను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. పురపాలకశాఖపై ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు భూములు అమ్మాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వచ్చే ఏడాది కూడా 600 ఎకరాలు దశల వారీగా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏడాదికి 50 ఎకరాలు చొప్పున.. ఎకరా రూ.10కోట్లకు విక్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, తొలి విడతలో మాత్రం 248.34 ఎకరాలను విక్రయించాలని భావిస్తున్నారు. తద్వారా రూ.2,480 కోట్లు సమీకరించాలని ప్రణాళిక రూపొందించారు.
No comments:
Post a Comment