సామాన్య భక్తులకు త్వరగా, సంతృప్తికర దర్శనం కోసం సలహాలు, సూచనలు ఇవ్వండి
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
ఆగమ సలహా మండలి ప్రతిపాదన మేరకే ఏడాదికోసారి సహస్ర కళశాభిషేకం, విశేష సేవ, వసంతోత్సవం
మీడియా వర్క్ షాప్ ముగింపు సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు త్వరగా, సంతృప్తికరంగా దర్శనం చేయించేందుకు టీటీడీ అధికారులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నామని, ఇందుకు మీడియా ప్రతినిధులు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి కోరారు. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం, నిద్రాహారాలు మాని పని చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు.
తిరుపతి శ్వేత భవనంలో టీటీడీ కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ మంగళవారం ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈవో శ్రీ ధర్మారెడ్డి 1957 నుండి నేటి వరకు స్వామివారి దర్శనం విధానంలో ఏర్పడిన అనేక మార్పులు, అంతకంతకు పెరుగుతున్న భక్తుల రద్ధీ అంశాలను సోదాహరణంగా వివరించారు. 1957లో రోజుకు 619 మంది స్వామివారి దర్శనానికి వచ్చేవారని, ఈ సంఖ్య నేడు లక్ష దాటుతోందని చెప్పారు. రోజుకు 80 వేలకు మించి భక్తులు స్వామివారి దర్శనం చేయించే అవకాశం లేదని, కానీ ఇటీవల భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగి క్యూలైన్ సేవాసదన్ వరకు వెళ్ళిన సందర్బంలో రోజుకు 94 వేల మంది భక్తుల స్వామివారి దర్శనం చేయించామని చెప్పారు. క్షణానికి ముగ్గురికి చొప్పున దర్శనం చేయించడం తమకు బాధ కలిగించిన తప్పలేదన్నారు. దర్శనం టోకెన్ల విధానంలో 1999 నుండి చోటుచేసుకున్న అనేక మార్పులను ఆయన వివరించారు. కోవిడ్ సమయంలో దేశంలోని అనేక ఆలయాలు మూత పడినా, తిరుమలలో మాత్రం ఒక రోజు కూడా స్వామివారికి నిత్య సేవలు నిలుపలేదని చెప్పారు.
కోవిడ్ అనంతరం 2021 మార్చి నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో భక్తులు దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండకుండా చేయడానికి సర్వదర్శనంకు కూడా తిరుపతిలో టోకెన్ల జారీ విధానం అమలు చేశామన్నారు. స్వల్ప సంఘటనలను కూడా చిలువలు, పలువలు చేయడంతో ఈ విధానం నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. లఘుదర్శనం, మహా లఘు దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల జారీలో చోటు చేసుకున్న అనేక మార్పులను అంకెలతో సహా వివరించారు. శ్రీవాణి టికెట్ల వల్ల తిరుమలలో 95 శాతం దళారులు తగ్గారని, ఇప్పటివరకు రూ.420 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. ఈ సొమ్ముతో ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీల్లో ఆలయాలు నిర్మస్తున్నామన్నారు. ఎస్వీబిసి అద్భుతంగా తీర్చి దిద్ధామని, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరచి సామాన్య భక్తులకు ఎక్కువ మందికి దర్శనం కల్పించామన్నారు. తిరుమల మ్యూజియంను టాటా ట్రస్టు రూ.100 కోట్లతో అభివృద్ధి చేపట్టనుందన్నారు.
ముంబయిలో రూ.500 కోట్ల విలువ చేసే 10 ఎకరాల భూమి మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి అందించిందని, రూ.70 కోట్లతో అక్కడ స్వామివారి ఆలయ నిర్మాణానికి దాత ముందుకు వచ్చారన్నారు. రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం నిర్మించామన్నారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.150 కోట్ల విరాళాలు వచ్చాయని, మరో ఏడాదిలో ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఆగమ సలహా మండలి ప్రతిపాధన మేరకే సహస్ర కళశాభిషేకం, విశేష సేవ, వసంతోత్సవం ఏడాదికి ఒక సారి నిర్వహించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందన్నారు.
జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, భూమి మీద తిరుమల వంటి క్షేత్రం లేదని, శ్రీ వేంకటేశ్వరస్వామిని మించిన దైవం లేదన్నారు. సనాతన హైందవ దర్మ పరిరక్షణ, వ్యాప్తికి టీటీడీ విశేష కృషి చేస్తోందని చెప్పారు. టీటీడీ ఏర్పాటు, శ్రీవారి ఆలయం, సప్తగిరులు, టీటీడీ ధర్మకర్తల మండలి, ఈవో, జెఈవో తదితర పాలన పరమైన వ్యవస్థను పిపిటి ద్వారా వివరించారు.
ఇటీవల టీటీడీ చేపట్టిన నూతన కార్యక్రమాలైన గుడికో గోమాత, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజితో దేవతా మూర్తుల ఫోటో ఫ్రేమ్‌ల తయారీ, గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత నైవేద్యం, నవనీత సేవ, ఎస్వీబిసి నూతన చానళ్ళ ప్రారంభం గురించి తెలియజేశారు. అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య నిధి, తిరుమలలో ప్లాస్టిక్ నిషేదం, టీటీడీ నిర్వహించే విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సప్తగిరుల్లో పచ్చదనం పెంపొందించడం, టీటీడీ ఆస్తుల పరిరక్షణకు జియో ట్యాగింగ్ సిస్టమ్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ శ్రీ వేంకటేశ్వర వైభవం అనే అంశంపై ప్రసంగించారు.
అంతకుముందు యోగ శిక్షకుడు శ్రీ జగదేక ప్రతాప్ యోగ సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు రెడ్డి, పిఆర్‌వో డాక్టర్ రవి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు
No comments:
Post a Comment