Pambam Bridge:వంతెన నిర్మాణంలో నవచరిత్ర! - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, June 25, 2022

Pambam Bridge:వంతెన నిర్మాణంలో నవచరిత్ర!

 Pambam Bridge:వంతెన నిర్మాణంలో నవచరిత్ర!




సముద్రపు కెరటాలు, గాలుల్ని తట్టుకుని పనులు

సముద్రయానం కోసం తొలిసారిగా రైల్వేలైన్‌ లిఫ్ట్‌


షిప్‌, క్రూయిజ్‌లు వచ్చినప్పుడు వంతెనను ఇలా పైకి లిఫ్ట్‌ చేస్తారు (నమూనా చిత్రం)

తమిళనాడులోని పంబన్‌ బ్రిడ్జికి ఇదివరకే చరిత్రలో ప్రత్యేకం స్థానముంది. 108 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థలకు చేరువైంది. దీంతో పక్కనే అధునాతన సాంకేతికతతో రైల్వే శాఖ మరో రెండు మార్గాల వంతెన నిర్మిస్తోంది. రైల్వే చరిత్రలో ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతమని అధికారులు పేర్కొన్నారు. ఏడాదిలో అందుబాటులోకి రానున్న వంతెన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం (పంబన్‌ ద్వీపం) మధ్య 1914లో పంబన్‌ బ్రిడ్జిని సముద్రంలో నిర్మించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. 2.06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్‌ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్‌లు వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది. ఇప్పుడు అలాకాకుండా ఏకంగా ట్రాక్‌ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్‌ చేసేలా అధునాతన సాంకేతికత తెస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.


సముద్రంలో చురుగ్గా నిర్మాణాలు


హోరు గాలులకు తట్టుకుని..

పాత బ్రిడ్జి కన్నా మరింత అత్యాధునికంగా బలంగా.. కొత్త పంబన్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని చేస్తున్నారు. ఇక్కడ సముద్రం ఎప్పుడూ ఉద్ధృతంగా ఉంటుంది. పైగా గంటకు 30 నుంచి 50 కి.మీ. మేర గాలులు వీస్తుంటాయి. మనిషి నిలబడేందుకు కూడా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్ని తట్టుకుని భారీ నిర్మాణాలు చేపట్టాల్సిఉంది. దానికి తగ్గట్లు ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నారు. తీరంలో సత్తిరక్కుడి రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రత్యేక వర్క్‌షాప్‌ను తెరచి అక్కడి నుంచి కాంక్రీటు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. గ్లైడర్లను, ఇతర దిమ్మెల్ని భారీ లారీలు, క్రేన్‌ల ద్వారా సముద్రం వరకు తెస్తున్నారు. అక్కడి నుంచి బ్రిడ్జి ప్రాంతానికి ప్రత్యేక ట్రాక్‌ల మీద తీసుకెళ్తున్నారు. ఇలా 2.078 కి.మీ. పొడవునా 100 దిమ్మెల నిర్మాణాల్ని చేపట్టారు. ఒక్కో దిమ్మె 18.3 మీ. ఉండేలా, దానిపై రైల్వేట్రాక్‌ వచ్చేలా నిర్మాణాలు పూర్తిచేశారు. మధ్యలో లిఫ్టుకు వాడే బరువైన స్టెయిన్‌లెస్‌స్టీల్‌నూ ఈ మార్గం ద్వారానే తరలిస్తున్నారు. ఈ లిఫ్టును 63 మీ. పొడవు, 72.5 మీ. ఎత్తుండేలా నిర్మిస్తున్నారు. పాత బ్రిడ్జికన్నా ఈ వంతెన మీటరు అదనపు ఎత్తు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. మరింత ధృఢంగా నిర్మాణాలుండేలా సముద్రంలోపలికి 35 మీ. మేర బోర్‌వేసి తుప్పుపట్టని భారీ దిమ్మెల్ని అమర్చారు. ప్రస్తుతం దిమ్మెల పనులన్నీ పూర్తవగా.. ఇప్పుడు ట్రాక్‌ వేసే పనుల్లో నిర్మాణ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నిమగ్నమైంది.


సాంకేతికతే ప్రత్యేకం


* భవిష్యత్తు అవసరాలకు డబ్లింగ్‌ పనులు చేపట్టేలా రెండు ట్రాక్‌లకు అవసరమైన స్థలాన్ని బ్రిడ్జిపై వదులుతున్నారు. ప్రస్తుతం ఓ ట్రాక్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

* రైల్వేలైన్‌ను పూర్తిగా విద్యుదీకరించే ప్రణాళికలున్నాయి. ఈ మార్గాన్ని రైల్వే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థతోపాటు ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టంతో అనుసంధానిస్తున్నారు.

* షిప్‌లు, క్రూయిజ్‌లు లాంటివి సులువుగా దాటివెళ్లేలా బ్రిడ్జి లిఫ్టును అమర్చుతున్నారు. ఈ లిఫ్టు పూర్తిగా రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేయనుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే..

రూ.250 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ లైన్‌ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. మరికొన్ని మాసాల్లో దీన్ని పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం బి.జి.మాల్యా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టును రైల్వే అత్యంత ప్రతిష్ఠాత్మకమని వెల్లడించారు. పర్యాటకులు, రామేశ్వరం వెళ్లే భక్తులకు ఈ వంతెన కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad