మట్టిలో మాణిక్యం, పల్లె కెరటం కే వి రబియా. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, June 13, 2022

మట్టిలో మాణిక్యం, పల్లె కెరటం కే వి రబియా.

 ఒకోసారి జీవితం అనుకోని మలుపులు తిప్పినప్పుడు తట్టుకోలేక అల్లాడే వారెందరో! తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ జీవితాన్ని నిస్సారంగా గడుపుతూ చివరకు తనువూ చాలించే వారెందరో !  కానీ జటిల పరిస్థితులను అర్థం చేసుకుని తెగించి తెచ్చుకున్న అచంచల మనోధైర్యంతో ముందడుగు వేసి, ఆత్మవిశ్వాసం ఆయుధంగా తనతో పాటు తన తోటి వారి జీవితంలో వెలుగులు విరజిమ్మేవారు చాలా అరుదు.విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అనుక్షణం ఉత్సాహంతో అలుపెరగని శ్రమతో సమాజానికి అపురూపమైన సేవ చేసేవారు మరీ అరుదు.అటువంటి పుణ్యమూర్తుల కోవకు చెందిన మహిళా రత్నం,  మట్టిలో మాణిక్యం, పల్లె కెరటం కే వి రబియా.

 పల్లె కెరటం కే వి రబియా.

కే వి రబియా (కరివెప్పిల్ రబియా) కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోని వెల్లిలక్కడు గ్రామంలో నిరుపేద ముస్లిం  కుటుంబంలో జన్మించింది. తండ్రి ఒక చిన్న రేషన్  షాప్ నిర్వహించేవాడు. రబియాకు చక్కని చదువులు చదవాలని ఆసక్తి. ఆమె  తిరురంగడి హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నప్పుడు ఆమెకు పోలియో సోకింది. అయినప్పటికీ ఇంటర్ వరకు మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్ళింది. కానీ 17 సంవత్సరాల వయసులో నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఇక ఆమె చక్రాల కుర్చీకే పరిమితం కావలసి వచ్చింది. దీనితో  డిగ్రీ మొదటి సంవత్సరం PMSO కాలేజీ తిరురంగడి  లో చదువుతున్న రబియా తప్పని సరి  పరిస్థితిలో ఆరోగ్య కారణాలతో  ఆమె కాలేజీ చదువు మానివేయవలసి వచ్చింది.  సాధారణ వ్యక్తులైతే ఒక్క దెబ్బకు జీవితం కుదేలయిపోయిందని అల్లాడిపోయేవారు. కానీ రబియా తన పరిస్థితిని అంగీకరించి మనోధైర్యాన్ని కూడా దీసుకుని ముందుకు పోవడం ఎలా అని ఆలోచించింది.  డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ మరియు పీజీ చదువును కొనసాగించింది.తాను ఉన్న గ్రామంలో చాలా మంది పేదవారు మరియు నిరక్షరాస్యులు. ముఖ్యంగా మహిళలు. చిన్నా చితక పనులు చేసుకునే ఆ కుటుంబాలలో అక్షరం ముక్క రాని వారెందరో! రబియా వారి గురుంచి, వారి జీవితాల గురుంచి ఆలోచించింది. తాను వారి కోసం ఏమయినా చేయగలనా అని తీవ్రంగా మదన పడింది. తానున్న పరిస్థితులలో చక్రాల కుర్చీకి అతుక్కుని పోయి జీవించ వెలిసిన పరిస్థితిలో తన తోటి గ్రామస్తుల జీవితం గురుంచి ఆలోచించడం మహానుభావులకే సాధ్యం.ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్న రబియా వయోజన విద్య  ప్రచారం (adult literacy campaign  )  జూన్ 1990 లో ప్రారంభించింది.  తన ఇంటిలో తానే చదువు చెప్తూ తన గ్రామంలోని  నిరక్షరాస్య మహిళలను  చదువుకునేందుకు  ఎంతగానో ప్రోత్సహించింది. తన ఇంటిని ఒక పాఠశాలగా తీర్చిదిద్దింది. ఈమె పాఠశాల కేవలం మహిళలకు మాత్రమే. ఆమె ఇల్లు కడలుండి అనే నది పక్కనే ఉంటుంది. క్రమక్రమంగా ఈమె పాఠశాల ఒక గురుకులం  మాదిరి తయారయింది. ఎవరయినా మహిళలు ఏ వయసు వారైనా వచ్చి చదువుకునే అవకాశం కలిపించింది.  ప్రారంభించిన కొద్దీ నెలలో లోనే ఎంతో మంది వయోజనులు రబియా టీచర్ దగ్గర విద్యను అభ్యసించేవారు. మహిళలకు కేవలం విద్య బోధించడమే కాకుండా,  ప్రభుత్వం నుంచి లభించే వివిధ ఉపాధి అవకాశాల గురుంచి తెలియచేసి వారికీ ఏదో ఒక ఉపాధి అవకాశం చూపించడం మొదలు పెట్టింది. దీనితో గ్రామంలో మరింత ప్రాచుర్యం పొందింది.జూన్ 1992 లో రబియా టీచర్ గురుంచి విన్న ప్రభుత్వాధికారులు ఈమె నిర్వహిస్తున్న పాఠశాల దర్శించారు. 80 సంవత్సరాల మహిళ పక్కన 8 సంవత్సరాల పాప కూర్చుని విద్యనభ్యసించడం వారు గమనించారు. రబియా టీచర్ కృషిని మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. గ్రామంలోని సమస్యల గురుంచి ఆమె ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే ఆ ఊరికి రోడ్, విద్యుచ్ఛక్తి, నీరు, టెలిఫోన్ సౌకర్యాలను కలిపించారు. ఈమె ఒక్కరి కృషితో మొత్తం గ్రామం కనీస మౌలిక సదుపాయాలను పొందింది. ఈమె కేరళ ప్రభుత్వం నిర్వహించిన అక్షరాస్యత ప్రచార కార్యక్రమంలో అద్భుతమైన పాత్రను తానుండే  మలప్పురం జిల్లాలో నిర్వహించింది.తాను నడవలేనని రబియా కు తెలుసు. కానీ అనేక మంది జీవితాలలో వారిని తానూ ముందడుగు వేయించగలనని తాను బలంగా నమ్మింది. ఈ లక్ష్య సాధన కోసం తాను ఇతరుల జీవితాలలో చలనం తీసుకువచ్చేందుకు గ్రామ ప్రజలు మరియు ఇతర ప్రముఖుల సహకారంతో 'చలనం' అనే స్వచ్చంద సేవ సంస్థను స్థాపించి తన మాదిరి అంగ వైకల్యం కలిగిన దేవాంగుల (physically disabled ) కోసం మరియు మానసిక లోపం కలిగిన పిల్లల (mentally retarded ) కోసం ఆరు పాఠశాలలను ప్రారంభించింది.  ఎంతో మంది విద్యార్థులకు, వయోజనులకు అండగా నిలబడిన ఈ సంస్థ  ప్రజలకు ఆరోగ్య  అవగాహన, ఆరోగ్య క్లబ్స్, విద్య ప్రాముఖ్యత, అవగాహన సదస్సులు, నిరంతర విద్య కొనసాగింపు,  మహిళలకు ఉపాధి శిక్షణ, దివ్యంగులకు పునరావాసం వంటి కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తోంది.అంతే కాకుండా మాదకద్రవ్యాలు, వ్యసనాలకు వ్యతిరేకంగా అవగాహనా సదస్సులు, వరకట్నం, మతతత్వం, మూఢ నమ్మకాలు, కుటుంబ సమస్యలు మొదలైన విషయాల పైన ప్రజలను చైతన్య పరుస్తూ ఉంది. తన గ్రామంలో మహిళల కోసం చిన్న ఉత్పత్తి పరిశ్రమ, మహిళా లైబ్రరీ మరియు యూత్ క్లబ్ స్థాపించి ఎంతో కృషి చేస్తున్నారు రబియా.  తనవైన కార్యక్రమాలతో దూసుకుపోయిన ధీర మహిళా రబియా కేరళ రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్ములనలో కీలక పాత్ర పోషించారు.మనోధైర్యంతో ముందుకు పోతున్న రబియాను సమస్యల పరంపర వెంటాడింది. కేవలం 32 సంవత్సరాల వయసులోనే కాన్సర్ బారిన పడిన రబియా అచంచల మనో ధైర్యంతో, మెడికల్ టెక్నాలజీ సహాయంతో కెమోథెరపీ వంటి చికిత్సల అనంతరం బయటపడింది. 40 సంవత్సరాల వయసులో బాత్రూం లో కింద పడటంతో ఆమె శరీరం పూర్తిగా కదలిక లేని స్థితిలో మంచానికే పరిమితం కావలిసి వచ్చింది. వైద్యానికి అవసరమైన డబ్బుకు ఆమెకు ఇబ్బంది అయింది. ఆ విపత్కర దిగ్భ్రాంతికర పరిస్థుతులలో ఆమె మంచానికే పరిమితమై, మాట్లాడలేని పరిస్థితిలో మానసిక బలాన్ని కూడగట్టుకుని, పదం పదం కూడా బలుక్కుని కలర్ పెన్సిళ్ల సహాయంతో నోట్ పుస్తకాల పైన   మౌన రోంబనంగల్‌ (నిశ్శబ్ద కన్నీరు) అనే పుస్తకం రచించింది. ఈ పుస్తకాన్ని కేరళ ముఖ్యమంత్రి వి ఎస్ అచుతానందం 2006 లో విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 2009 లో తన ఆత్మ కథ (Swapnangalkku Chirakukalundu) స్వప్నన్గాల్కు చిరాకుకలుండు (కలలకు రెక్కలుంటాయి) రాసి విడుదల చేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆత్మ కథ (auto biography) లో ఒకటిగా ఈ పుస్తకాన్ని సుకుమార్ అజ్హికోడే కీర్తించడం జరిగింది. ఇవే కాకుండా ఈమె ఇంకా 3 పుస్తకాలూ రాయడం జరిగింది. ఈ పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే రాయల్టీ తో ఈమె తన వైద్య ఖర్చులను భరిస్తూ ఉంది.  ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా ఆమె వంద మంది వాలంటీర్స్ సహాయంతో తన NGO చలనం కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తూండడం అపూర్వం. అద్వితీయం.అంగ వైకల్యం ఉన్నపటికీ ఆమె చేసిన కృషి కేరళ అక్షరాస్యత ప్రచార కార్యక్రమంలో ఆమెను ఒక విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ అలీ అక్బర్ నిర్మించిన రబియా మూవ్స్ (RABIYA MOVES ) అనే ఆత్మకథ చిత్రం విశేష ఆదరణ పొందడమే కాకుండా 14 భాషలలోకి తర్జుమా చేయబడింది. ఒక అపురూప ప్రేరణాత్మక చిత్రంగా ఈ చిత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక పత్రికలూ రబియా కీర్తిని ప్రశంసిస్తూ 100 కు పైగా ఆర్టికల్స్ ప్రచురించడం ఈమె బలానికి, కృషికి లభించిన ఒక అపురూపమైన గౌరవం.అచంచల విశ్వాసంతో, అకుంఠిత దీక్షతో, అసామాన్య సంకల్పంతో, మరువలేని మనోధైర్యంతో అజరామరమైన కృషి చేసిన కరివెప్పిల్ రబియా కు ప్రపంచం నీరాజనం పట్టింది.



1994 లో భారత ప్రభుత్వం నుంచి నేషనల్ యూత్ అవార్డు




1999 లో Junior Chamber International వారి Outstanding Young Indian అవార్డు



2000 లో కణ్ణగి దేవి స్త్రీ శక్తి పురస్కార్










2000 లో youth volunteer against poverty అవార్డు (కేంద్ర ప్రభుత్వం మరియు UNDP సంయుక్త అవార్డు )


నెర్హు యువక కేంద్ర అవార్డు


బజాజ్ ట్రస్ట్ అవార్డు


రామాశ్రమం అవార్డు


స్టేట్ లిటరసీ సమితి  అవార్డు


సీఠీ సాహిబ్ స్మారక అవార్డు


జోసెఫ్ ముందస్సేరి అవార్డు ఫర్ సోషల్ వర్క్


డాక్టర్ మేరీ వెర్గీస్ అవార్డు ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఎంపవరింగ్ ఎబిలిటీ

మొదలైన ఎన్నో అవార్డ్స్ లభించాయి.  అన్నింటికీ మించి 2022 లో భారత ప్రతిభుత్వం 73 వ గణతంత్ర  దినోత్సవం  పురస్కరించుకొని ధీర మహిళా రబియా కు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది.ఒక చిన్న సమస్యకు క్రుంగి పోయి అల్లాడి పోయేవారెందరో ఉన్న ఈ సమాజంలో, ఉప్పెనలా సమస్యలు వెంటాడుతున్నా చెక్కు చెదరని మనో సంకల్పంతో, ధైర్యంతో తానూ ముందడుగు వేయడమే కాకుండా సమాజంలో వేలాది మందికి దారి చూపి మానవ జాతికే ప్రేరణగా నిలిచిన మహనీయురాలు రబియా చూపిన బాట సకల మానవాళికి ఆదర్శం! అనుసరణీయం!

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad