సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 2, 2022

సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

 సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు





– ధ్వ‌జారోహ‌ణం రోజు ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌
– మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు
– ప్రాథ‌మిక స‌మీక్ష‌లో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వెల్ల‌డి
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఈసారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, మాడ వీధుల్లో వాహ‌నసేవ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్‌వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌తో క‌లిసి శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో అన్ని విభాగాల అధికారుల‌తో ప్రాథ‌మిక స‌మీక్ష నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంద‌ని, ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వివ‌రించారు. ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాస్తామ‌న్నారు. అక్టోబ‌రు 1న గరుడ వాహనం, అక్టోబ‌రు 2న స్వర్ణరథం, అక్టోబ‌రు 4న రథోత్సవం, అక్టోబ‌రు 5న‌ చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు.
క‌రోనా కార‌ణంగా గ‌తంలో రెండు ప‌ర్యాయాలు వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని, ఈసారి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌ల ఊరేగింపు ఉంటుంద‌ని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, ఇందుక‌నుగుణంగా ప‌టిష్టంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌న్నారు. ఈసారి గ‌రుడ‌సేవ పెర‌టాసి మాసంలో మూడో శ‌నివారం రోజున జ‌రుగ‌నుంద‌ని, భ‌క్తులు విశేషంగా విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని వివ‌రించారు. సామాన్య భ‌క్తుల‌కు ఎక్కువ ద‌ర్శ‌న‌ స‌మ‌యం క‌ల్పించేందుకు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌ని, ఫ్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నాలు మంజ‌రు చేస్తామ‌ని తెలిపారు.
తిరుమ‌ల‌లో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, అలిపిరి, శ్రీ‌వారిమెట్టు న‌డ‌క‌మార్గాల్లోనూ ప‌రిశుభ్రంగా ఉంచుతామ‌ని ఈవో తెలిపారు. వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. రుయా, స్విమ్స్ ఆసుప‌త్రుల నుంచి స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌ను ర‌ప్పించి వైద్య సేవ‌లు అందిస్తామ‌ని తెలిపారు. పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. త‌గిన‌న్ని ఆర్టిసి బ‌స్సులు ఏర్పాటుచేస్తామ‌ని, గ‌రుడ‌సేవ నాడు భ‌క్తులు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను తిరుప‌తిలోనే పార్క్ చేసి బ‌స్సుల్లో తిరుమ‌ల‌కు చేరుకోవాలని కోరారు. గ‌రుడ సేవ జ‌రిగే రోజుతోపాటు ఆ ముందు రోజు, త‌రువాతి రోజు ఆన్లైన్‌లో గ‌దుల కేటాయింపు ఉండ‌ద‌ని, మిగిలిన రోజుల‌కు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో కేటాయిస్తామ‌ని, మిగిలిన‌వి క‌రంట్ బుకింగ్‌లో భ‌క్తుల‌కు కేటాయిస్తామ‌ని చెప్పారు.
భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు అందిస్తామ‌ని, మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటుచేసి తాగునీరు, మ‌జ్జిగ పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధం అమ‌ల్లో ఉన్నందున భ‌క్తుల త‌మ‌తోపాటు గాజు లేదా రాగి లేదా స్టీల్ బాటిళ్లు వెంట తెచ్చుకోవాల‌ని కోరారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇంజినీరింగ్ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. తిరుమ‌ల‌లోని భ‌వ‌నాలు, చెట్ల‌పై విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేప‌డ‌తామ‌న్నారు. గ‌రుడ సేవ నాడు భ‌క్తులు ఎత్తైన భ‌వ‌నాలు ఎక్క‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానిస్తామ‌ని చెప్పారు.
ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్ బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాథ్, ఇతర డెప్యూటీ ఈఓలు, ఇఇలు, అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌, ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad