ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ
– రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌లతో ఒప్పందం
– మధ్యవర్తుల ప్రమేయం ఉండదు
– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారుచేసేందుకు వీలుగా మలి విడతలో 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌లతో ఒప్పందం చేసుకున్నామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 2021, అక్టోబరు 11న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గారి సమక్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థతో ఎంఓయు చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు తొలివిడతలో 500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశామన్నారు. మలి విడతలో ప్రస్తుతం బియ్యం, శనగలు, బెల్లం, కందిపప్పు, పెసలు, పసుపు, వేరుశనగ, మిరియాలు, ధనియాలు, ఆవాలు, చింతపండు, ఉద్దిపప్పు సేకరించాలని నిర్ణయించామన్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుందని, ఈ సంస్థ నుండి మార్క్‌ఫెడ్ కొనుగోలుచేసి తగిన విధంగా మార్పుచేసి టిటిడికి అందిస్తుందన్నారు. ఈ వ్యవస్థలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని చెప్పారు.
టిటిడి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిందని, ప్రజలు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేని పంట ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటామని, ఈ మేరకు అనారోగ్య సమస్యలకు పెట్టే ఖర్చు తగ్గుతుందని చెప్పారు. టిటిడి కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. టిటిడి స్ఫూర్తితో రాష్ట్రంలోని ఇతర ఆలయాలు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో అన్నప్రసాదాలు తయారుచేసేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. క్రమక్రమంగా హోటళ్లు, ఇతర సంస్థలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ శ్రీ విజయకుమార్ మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్ కలిసి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన శనగపప్పును టిటిడికి సరఫరా చేసినట్టు తెలిపారు. మొదటి దశలో 1300 మెట్రిక్ టన్నుల శనగలను రైతుల నుండి సేకరించి రసాయన అవశేషాలను పరిశీలించడం జరిగిందన్నారు. మలి దశలో 12 రకాల వంటసరుకులను సేకరించేందుకు ప్రకృతి వ్యవసాయ రైతుల ఎంపిక జరుగుతోందని, ప్రత్యేక పర్యవేక్షణలో రసాయనాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకుని పంటలు పండిస్తారని తెలిపారు. గతేడాది టిటిడి గోశాల నుండి 1800 ఆవులు, ఎద్దులను ప్రకృతి వ్యవసాయ రైతులకు అందించినట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలల వద్ద మిగులుగా ఉన్న ఆవులను, ఎద్దులను రైతులకు అందించేందుకు టిటిడి చర్యలు చేపట్టిందన్నారు.
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మధుసూదనరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు రసాయన రహిత వంట సరుకులతో తయారుచేసిన ప్రసాదాలు అందించాలని టిటిడి నిర్ణయించడం ముదావహమన్నారు. ఇందులో భాగంగా మొదటగా లడ్డూ తయారీకి వినియోగించే శనగలను ప్రయోగాత్మకంగా సేకరించిందన్నారు. ఈసారి రాష్ట్ర రైతు సాధికార సంస్థ పర్యవేక్షణలో ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన 12 రకాల వంట సరుకులను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి టిటిడికి అందజేస్తామన్నారు.
మార్క్‌ఫెడ్ ఎండి శ్రీ ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 1276 మెట్రిక్ టన్నుల శనగలు ఇవ్వాలని టిటిడి కోరగా 500 మెట్రిక్ టన్నులు సేకరించి అందించామన్నారు. కనీస మద్దతు ధర కంటే 10 శాతం ఎక్కువగా చెల్లించడం ద్వారా అటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని, ఇటు టిటిడికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన వంట సరుకులు అందుతాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు 7 నుండి 10 రోజుల్లోపు మార్క్‌ఫెడ్ సొమ్ము చెల్లిస్తుందని, ఆ తరువాత టిటిడి నుండి మార్క్‌ఫెడ్ రీయింబర్స్‌మెంట్ తీసుకుంటోందని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, గోశాల సంచాలకులు డాక్టర్ హరనాథరెడ్డి, మార్కెటింగ్ జిఎం శ్రీ సుబ్రహ్మణ్యం, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ప్రొఫెసర్ వెంకటనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment