బీసీల ద్రోహి ప్రధాని మోదీ :బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బీసీల ద్రోహి ప్రధాని మోదీ అనీ, హామీల అమల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వైఫల్యం చెందారంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మండిపడ్డారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీపీ మండల్ నివేదికను కేంద్రం బుట్ట దాఖలు చేసిందన్నారు. మోదీ ప్రభుత్వం గద్దెనెక్కి పదేళ్లు పూర్తి చేసుకోబోతున్నా బీసీ గణన చేపట్టలేదన్నారు. బీసీ కోటాలో రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న ప్రధాని ఆ వర్గాలకు ఒరగబెట్టింది సున్నా అంటూ మండిపడ్డారు. బీసీల ఉన్నతిని చాటే బీపీ మండల్ నివేదికను బుట్ట దాఖలు చేసిన ఆగస్ట్ 7వ నాడే దేశవ్యాప్త నిరసనలకు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయని చెప్పారు. అందులో భాగంగా 18 రాజకీయ పార్టీల మద్దతుతో, 22 బీసీ సంఘాల నాయకులు దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ వస్తున్నామన్నారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టినప్పుడు రజకులు, కుమ్మరి, నాయీ బ్రాహ్మణులకు మంత్రులు, ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారనీ, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా హామీలు ఎందుకు అమలుపర్చలేదని ప్రశ్నించారు. బీసీలు వారి హక్కులను సాధించుకోవాలన్నా, చట్ట సభల్లో, మంత్రిత్వ శాఖలో ప్రాతినిధ్యం వహించాలన్నా బీసీలంతా ఐక్యతారాగం పాడాలన్నారు. బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించడమే లక్ష్యంగా ఆగస్టు 07వ తేదీన తిరునగరి వేదికగా తలపెట్టబోతున్న ఓబీసీ దేశ వ్యాప్త మహా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వర రావు, రాష్ట్రఉపాధ్యక్షుడు వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతి కుమార్, పట్టణ అధ్యక్షుడు గురు సాయి, సోమశేఖర్, శ్రీనివాసరావు, భాస్కర్, తదితరులు పల్గొన్నారు.
No comments:
Post a Comment