మట్టి మాఫీయా నుంచి శ్మశానాన్ని కాపాడండి : సీఐటీయూ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మట్టి మాఫియా కబంద హస్తాల్లోంచి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న శ్మశాన వాటికను కాపాడాలని రాజీవ్ నగర్ కాలనీ వాసులు బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీరి నిరసనకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అవినీతి మాఫియా పెట్రేగిపోతోందన్నారు. చెరువులు, గుంతలు, కాలువలు, చివరకు శ్మశానాలను సైతం మాఫియా వీరులు వదలడం లేదని వాపోయారు. ఈ క్రమంలోనే పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్ నగర్ కాలనీ వాసులకు(హిందూ, ముస్లిం, క్రిస్టియన్)2010లో ప్రస్తుత జగనన్న కాలనీ వెనుక భాగంలో కంచర్ల గుంట వద్ద కేటాయించిన ఐదెకరాల శ్మశాన స్థలంలో మట్టి మాఫియా అక్రమ తవ్వకాలు చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో పూడ్చి పెట్టిన శవాలను సైతం పక్కకు తోసి రాత్రికి రాత్రే జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో మట్టి, ఎర్రగుళ్ల తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ప్రస్తుతం అక్కడ మట్టిని మాత్రమే తరలిస్తున్నారనీ, చూస్తూ ఊరుకుంటే కబ్జా చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన స్థలాన్ని కాపాడడంతోపాటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల శ్మశాన వాటికలకు హద్దులు ఏర్పరచాలని కోరారు. అనంతర సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజీవ్ నగర్ కాలనీవాసులు కరీముల్లా ఖాన్, రహీం, దస్తగిరి, సర్దార్, రహీం బాషా, బాలాజీ నాయుడు, బత్తెయ్య, గురునాథం, ప్రసాద్, సీఐటీయూ నాయకుడు గంధం మణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment