నారాయణగిరిశ్రీవారిపాదాలచెంతవేడుకగాఛత్రస్థాపనోత్సవం
తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత మంగళవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజ సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.
No comments:
Post a Comment