తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమల శ్రీనివాసుడి వార్షిక ఉత్సవమైన పవిత్రోత్సవాలను నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవలను టీటీడి మూడు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసింది. భక్తులు ఈ విషయం తెలుసుకుని తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
పవిత్రోత్సవాలు ఎప్పడు మొదలయ్యాయి..
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం కలుగకుండా ఉండేందుకు మూడు రోజుల పాటు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలను శ్రీవారి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక చారిత్రక నేఫధ్యంలో ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్ధంలో ఐదు రోజుల పాటు నిర్వహించే వారని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా క్రీ.శ.1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో పంచాహ్నికంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమాన్ మహమండలేశ్వర మేదిని మీశర గండకట్టారి సాళువ మల్లయ్యదేవ మహారాజు రాయించిన శాసనంలో మనకు ఈ విషయం తెలుస్తోంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ.1562 వరకు నిరంతరాయంగా నిర్వహించి, అటుతరువాత కాలంలో ఏ కారణం చేతనో పవిత్రోత్సవాలను నిర్వహించడం నిలిపివేశారు. హైందవ సనాతన ధర్మ సంరక్షణను కాపాడేందుకు 1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పవిత్రోత్సవంను ఇలా ప్రారంభిస్తారు..
నేటి (ఆగస్టు 8) నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరగనున్న వార్షిక ఉత్సవమైన పవిత్రోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. ఇక ఆదివారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంను ఆలయ అర్చకులు నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి సర్వసైన్యాధ్యక్షడు విశ్వక్సేనులు ఆలయంలో నుంచి బయటకు వచ్చి ఊరేగింపుగా తిరుమాఢ వీధులలో ఊరేగారు. ఆలయం వెనుక ఉన్న వసంత మండపం వద్ద పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుని, ఆలయంలోని యాగశాలలో ఆ పుట్టమన్నుతో నవధాన్యలను మెలకెత్తించారు. దీంతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ముగిసింది.
తిరుమలలో ఈ సేవలు 3 రోజులపాటు రద్దు..
ఈ అంకురార్పణ ఘట్టం పూర్తైన మరుసటి రోజు నుండి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను ప్రారంభిస్తారు ఆలయ అర్చకులు. సోమవారం ప్రారంభం కానున్న పవిత్రోత్సవాల నేఫద్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహాస్రదీపాలంకరణ సేవతో పాటు వారపు సేవలైన అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. పవిత్రోత్సవాలు బుధువారంతో పరిసమాప్తం కానుండడంతో గురువారం నుంచి శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జితసేవలను టీటీడీ పునరుద్ధరణ చేయనుంది.
No comments:
Post a Comment