పాఠశాలల విలీన ప్రక్రియ ఆపండి
చక్రాల ఉష |
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిన పాఠశాలల విలీన ప్రక్రియ వెంటనే ఆపాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండు చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా పేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారనన్నారు. ఇంటి పక్కన ఉన్నపాఠశాలను వదిలి ఎక్కడో రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నపిల్లలను పంపాల్సిన పరిస్థితి దాపురించిదన్నారు. ఈ నిర్ణయం వలన కొందరు ప్రైవేటు పాఠశాలలకు వెళుతుండగా... మరి కొందరు ఆర్థిక స్థోమత లేక బడికి దూరం అవుతున్నారని చక్రాల ఉష ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో సరైన వసతులు లేవని... సైన్స్ లాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను గ్రంథాలయ గదులను తరగతి గదులు గా మార్చివేసి అందులో విద్యా బోధన చేస్తున్నారన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక తరగతి గదిలో 30 మంది విద్యార్థులకు మించి ఉండకూడదన్నారు. అయితే ఇక్కడ ఒక్కొక్క తరగతి గదిలో సుమారు 50 మంది విద్యార్థులను ఉంచి విద్యా బోధన చేస్తున్నారని ఆమె చెప్పారు. హరహర బావి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 95 మంది విద్యార్థులు... ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 84 మంది విద్యార్థులు బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్ లో భాగంగా విద్యార్థులను పంపారన్నారు. ఈ పాఠశాలలో ఒక పక్క తరగతి గదుల నిర్మాణం జరుగుతున్నదని... మరొక పక్క చాలీచాలని ఇరుకు గదులలో విద్యార్థులకు విద్యాబోధన జరుగుతోందన్నారు. పిల్లలకు ఎంతో దగ్గరలో ఉన్న పాఠశాలలను విడిచిపెట్టి ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలకు పిల్లలను పంపించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. బహదూర్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాల కి వెళ్ళమని ఆదేశించారన్నారు. అంత దూరం చదవడం ఇష్టం లేక పిల్లలందరూ పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి వీలైనంత తొందరగా మొదట చదివే పాఠశాలలోనే విద్యార్థులకు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని చక్రాల ఉష డిమాండు చేశారు.
No comments:
Post a Comment