కుర్చీపై మూత్రం ఘటనపై విచారణ జరపండి : అంగేరి పుల్లయ్య
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
అధికార మదంతో చిల్లకూరు మండల దళిత జడ్పిటిసి కుర్చీపై మూత్రం పోసి అవమానపరిచిన అమానవీయ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు దాటిపోతున్నా సమాజంలో దళితులు, దళిత ప్రజాప్రతినిధులపై పెత్తందార్ల కులాహంకారదాడులు చోటు చేసుకుంటుండటం సిగ్గు చేటన్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం జడ్పీటీసీ శీనయ్యను అదే మండలానికి చెందిన అగ్రవర్ణ వైసీపీ నేత ఒకరు తనముందే కుర్చీ వేసుకుని కూర్చుంటావా అంటూ కులం పేరుతో దూషించడమే కాకుండా కుర్చీపై మూత్రం పోవడం అంటరానితనానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని వాపోయారు. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు కాదా అంటూ ప్రశ్నించారు. దళిత ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కలుగజేసుకుని చిల్లకూరు ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలనీ, సదరు వైసీపీ నేతపై వెంటనే చర్యలు తీసుకుని దళిత జడ్పీటీసీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment