విద్యుత్ చార్జీలపై వామపక్షాల పోరుబాట
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీ నుంచి సిపిఎం, సిపిఐ నాయకులు పోరుబాట పట్టనున్నారు. ఆ మేరకు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో శుక్రవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో 'కరెంటు బిల్లులతో జనానికి షాక్' కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం సిపిఎం నియోజవర్గ ఇన్చార్జి అంగీర్ పుల్లయ్య, సిపిఐ ఇన్చార్జి జనమాల గురవయ్య సంయుక్తంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీల తగ్గింపు పై ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసారని విమర్శించారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా మూడు రూపాయలకు కొనాల్సిన యూనిట్ ను రూ.10 నుంచి రూ.20 కొనుగోలు చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు అసలు చార్జీల కంటే అసలు చార్జీలే అధికమైపోయాయని వాపోయారు. అసలు చార్జీలు ఐదు శాతం ఉండగా, కొసరు చార్జీలు 95 శాతం ఉండడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6వేల భారం మోపిన జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల గొంతు కోసేందుకు పూనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా వామ పక్ష నాయకులు శనివారం నుంచి 30వ తేదీ వరకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తాలని సూచించారు. ఈనెల 30న జరిగే విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గంధం మణి, పెనగడం గురవయ్య, శివ కుమార్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment