ప్రభుత్వ బడుల్లోనే భవిష్యత్తుకు పునాదులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసిస్తేనే అది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా మారుతుందని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయ బియ్యపు పవిత్రా రెడ్డి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పవిత్రా రెడ్డి మాట్లాడుతూ పలు దేశాల్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అటువంటి దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం అధిక పోటీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే మనదేశంలో ప్రభుత్వ పాఠశాలలో అటువంటి పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులకు ఓట్లు ఉండవు కాబట్టే విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. పటిష్టమైన విద్యను అందించాలని లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు భువనేశ్వరి, భారతి, ప్రేమలత, సమగ్ర శిక్ష జిల్లా ప్లానింగ్ కో-ఆర్డినేటర్ రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయులు చంద్రబాబు, ప్రిన్సిపల్ సుధాకర్, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment